వైసీపీకి మేకతోటి సుచరిత గుడ్ బై ?
గుంటూరు జిల్లాకు చెందిన మరో కీలక నాయకురాలు, ఎస్సీసామాజిక వర్గానికి చెందిన నేత జగన్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జగన్ అంటే తమ కుటుంబానికి ఆరాధ్యదైవం అని కుటుంబ సమేతంగా మీడియా ముందుకు నొక్కివక్కాణించిన మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సుచరిత ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. తొలి హోం మంత్రిగా ఎస్సీ నాయకురాలిగా ఉన్న సుచరితకు జగన్ అవకాశం ఇచ్చారు. అయితే, రెండున్నరేళ్లకు ఆమెను తొలగించి, మరో ఎస్సీ నాయకురాలికి ఇదే పదవి ఇవ్వడాన్ని సుచరిత జీర్ణించుకోలేక పోయారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక, ఎన్నికల సమయానికి మరింత గ్యాప్ పెరిగింది. సుచరితను ఆమె సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి గుంటూరులోని తాడికొండ నియోజకవర్గానికి మార్చారు. తొలుత అసలు టికెట్ తీసుకునేందుకు కూడా మొగ్గు చూపలేదు. ఆ సమయంలో ఓ కీలక పార్టీలోకి మారేందుకు ప్రయత్నించారు. అయితే భర్త సూచనలతో పార్టీలో కొనసాగారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సుచరిత ఘోరంగా ఓడిపోయా రు. తర్వాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ కీలక పార్టీతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ అధినేత, ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆమె త్వరలోనే పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.