చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి రెండు స్వర్ణాలు !
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో పురుషులు, మహిళల జట్లు తొలిసారి స్వర్ణాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల జట్టుకు సంబంధించి స్లొవేనియాతో జరిగిన చివరిదైన 11వ రౌండ్‌లో డి.గుకేశ్, అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానందలు తమ తమ గేమ్‌లను గెలుపొందారు. వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్ ఓడించగా, జాన్ సుబెల్జ్‌పై ఇరిగేశీ, అంటన్ డెమ్చెంకోపై ప్రజ్ఞానంద విజయం సాధించారు. వాస్తవానికి టైటిల్ గెలిచేందుకు పురుషుల జట్టుకు 11వ రౌండ్‌లో 'డ్రా' సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన గేమ్‌లలో ఓడిపోయినా స్వర్ణం ఖాయమైంది. 45వ చెస్ ఒలింపియాడ్‌లో పురుషుల జట్టు తొలి ఎనిమిది రౌండ్‌లలో గెలిచి, తొమ్మిదో రౌండ్‌ను డ్రాగా ముగించింది. కీలకమైన పదో రౌండ్‌లో 2.5-1.5తో బలమైన అమెరికాను మట్టికరిపించింది. చివరిదైన 11వ రౌండ్‌లో స్లొవేనియాపై పైచేయి సాధించింది. భారత మహిళల జట్టు కూడా తొలిసారి పసిడిని సాధించి రికార్డు సృష్టించింది. 11వ రౌండ్‌లో 3.5-0.5తో అజర్‌బైజాన్‌పై విజయం సాధించింది. డి.హారిక, దివ్య దేశ్‌ముఖ్‌లు తమ తమ గేమ్‌లలో విజయం సాధించగా.. ఆర్.వైశాలి డ్రాగా ముగించింది. అనంతరం వంతిక అగర్వాల్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడంతో మహిళల జట్టు విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో ఒకేసారి రెండు స్వర్ణాలు చేరాయి.