ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది : అంజలి
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్లిన బాలకృష్ణ ఈ వేడుకలో తనదైన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్స్ నేహా శెట్టి, అంజలితో స్టేజ్ పై మాట్లాడుతూ అంజలిని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన క్లిప్ షేర్ చేస్తూ బాలయ్య పై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై హీరో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ అంజలి రియాక్ట్ అయ్యింది. అయితే నేరుగా బాలయ్య వివాదంపై రియాక్ట్ కాకుండా పరొక్షంగా ట్రోల్స్‌కు చెక్ పెట్టింది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. నాకు, బాలకృష్ణ గారికి ఒకరిపట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలంగా మంచి స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది' అంటూ ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్యతో కలిసి ఉన్న క్లిప్స్ ఓ వీడియోగా మార్చి షేర్ చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదమవుతున్న క్లిప్ కూడా వీడియోలో షేర్ చేస్తూ ట్రోల్స్‌కు చెక్ పెట్టేసింది అంజలి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా నెటిజన్స్ స్పందిస్తున్నారు.