ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
నైరుతి ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నాలుగు అంతస్తులు భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇద్దరిని రెస్క్యూ చేసి రక్షించినట్లు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కూలిపోయిన భవనంలో పెయింగ్ గెస్ట్(పీజీ) హాస్టల్ ఉన్నట్లు తెలుస్తోంది. సత్య నికేతన్ ప్రాంతం ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలో ఉండటంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులు నివసిస్తుంటారు. భవనం కూలిన సమయంలో లోపల సుమారు 50 మంది విద్యార్థులు ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. భవనం కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకువచ్చేందుకు జేసీబీలు,12 ఫైర్ ఇంజన్లు వాడుతున్నారు. ఆదివారం కావడంతో చాలా మంది విద్యార్థులు భవనంలోనే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శిథిలా కింద నుంచి సహాయం కోసం కేకలు వినిపిస్తున్నట్లు అక్కడున్న వారు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు భనవం కింద నుంచి ఫోన్లు చేస్తున్నారని శిథిలాల కింద చిక్కకుపోయి ఉండొచ్చని ఎమ్మెల్యే అనిల్ శర్మ చెప్పారు.