గృహప్రవేశ కార్యక్రమంలో రూ.50 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు : తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ నగరంలో శుభకార్యాలు జరుగుతున్న ఇళ్లపై కొందరు ట్రాన్స్‌జెండర్ల పేరుతో చేస్తున్న దాడిపై తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్రమ వసూళ్లు , బెదిరింపుల దందాపై తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇటీవల చింతల్ ప్రాంతంలో జరిగిన ఒక గృహప్రవేశ కార్యక్రమంలో రూ.50,000 నగదు డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్న ఘటన కలకలం రేపింది. ఈ క్రమంలో బాధితుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, శాపనార్థాలు పెట్టడంపై తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి బలవంతపు వసూళ్లపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ డ్రైవ్ నిర్వహించాలని ఆయన పోలీసు కమిషనర్లను ఆదేశించారు. సెప్టెంబర్ 4న చింతల్‌లోని తమ నూతన గృహంలోకి అడుగుపెడుతున్న ఒక కుటుంబాన్ని కొందరు ట్రాన్స్‌జెండర్లు అడ్డుకున్నారు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేమని ఆ కుటుంబం వేడుకున్నప్పటికీ, వారు వినిపించుకోకుండా తీవ్ర పదజాలంతో దూషించారు. సామాజిక మాధ్యమాల్లో బాధితులు పంచుకున్న ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల రక్షణ పై ప్రశ్నలు రేకెత్తించింది. ఈ తరహా ఉదంతాలపై ఫిర్యాదులు పెరగడంతో, గతంలో తాను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు చేపట్టిన ప్రత్యేక అణచివేత చర్యలను రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ పునరావృతం చేయాలని డీజీపీ అధికారులకు స్పష్టం చేశారు. పోలీసు చర్యలు కేవలం అక్రమ దందాలు, బెదిరింపులకు పాల్పడే నేరపూరిత మూకల పైనే ఉంటాయని, ఇవి మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల జీవనోపాధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. నగరంలో ఇప్పటికే పలువురు ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, ఇతర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ చర్యలను వాడుకుంటూ గౌరవంగా జీవించే వారిని, దందాలు , భయానక వసూళ్లకు పాల్పడే మూకలను వేర్వేరుగా చూస్తామని పోలీస్ యంత్రాంగం తేల్చిచెప్పింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో నిఘా పెంచి, ఇటువంటి బలవంతపు వసూళ్ల ముఠాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. శుభకార్యాలు చేసుకునే సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే చట్టపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.