ఆసుపత్రిలో వెంటిలేటర్‌లో పేలుడు : ఎన్ఐసీయూలో మంటలు చెలరేగి ముగ్గురు నవజాత శిశువులు మృతి

హారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. మరికొందరు చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నేడు తెల్లవారుజామున సుమారు 3:15 నుంచి 3:30 గంటల మధ్య ఆసుపత్రి మూడో అంతస్తులోని ఎన్ఐసీయూలో ఈ ప్రమాదం జరిగింది. ఎన్ఐసీయూ లోని వెంటిలేటర్‌లో పేలుడు సంభవించిన అనంతరం మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 39 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. మంటలు చెలరేగిన వెంటనే విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే శిశువులను ఎన్ఐసీయూ నుంచి తరలించడంతో పలువురి ప్రాణాలను కాపాడగలిగారు. అయితే ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు శిశువులను మెరుగైన చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఎన్ఐసీయూలో మూడు విభాగాలు ఉండగా.. ఒక్కో విభాగంలో 13 మంది శిశువులకు చికిత్స అందించే సామర్థ్యం ఉంది. ఈ ఘటనపై ఎన్సీపీ  నాయకురాలు సుప్రియా సూలే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. శిశువుల కోసం తల్లిదండ్రులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారని, అలాంటి సమయంలో తమ బిడ్డను ఈ విధంగా కోల్పోవడం వారి కుటుంబాలకు ఊహించలేని విషాదమని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ప్రమాదంగా చూడకుండా.. వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org