తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతంపై ఏకగ్రీవ తీర్మానం ఆమోదం

మిళనాడులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో జరిగే అధికారిక కార్యక్రమాలను ఇకపై కచ్చితంగా రాష్ట్ర గీతమైన 'తమిళ తాయ్ వాళ్తు'తోనే ప్రారంభించాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి సభలో ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కాంగ్రెస్, బీజేపీ తదితర అన్ని పార్టీలు దీనికి పూర్తి మద్దతు తెలిపాయి. సభ్యుల మద్దతుతో మూజువాణి ఓటింగ్ ద్వారా ఈ తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గినట్లు స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ చారిత్రక నిర్ణయం పట్ల ప్రభుత్వ వర్గాలు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ, మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి. ఇది కేవలం భాషకు సంబంధించిన విషయం కాదని, తమిళుల అస్తిత్వానికి, భాషా గౌరవానికి దక్కిన గొప్ప విజయమని అభివర్ణించారు. “తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది ఒక ఆలోచన, సంస్కృతి, నాగరికత, మన జీవన విధానం మరియు సజీవ చైతన్యం” అని పేర్కొన్నారు. ఈ తీర్మానం అమలు చేయడానికి ఎలాంటి బాహ్య అనుమతులు అవసరం లేదని సభ స్పష్టం చేయడం విశేషం. ప్రఖ్యాత పండితుడు మనోన్మణియం సుందరనార్ 1891లో రచించిన ‘మనోన్మణియం’ నాటకం నుంచి ఈ గీతంలోని పదాలను స్వీకరించడం జరిగింది. నాటి నుంచి క్రమంగా ప్రాచుర్యం పొందిన ఈ గీతాన్ని 1970వ దశకం నుంచే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆలవాయించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత కాలంలో, 2021 డిసెంబర్‌లో దీనిని ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర గీతంగా గుర్తించింది. రాష్ట్ర సాంస్కృతిక మరియు భాషా హక్కులను పరిరక్షించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org