కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్
ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత శక్తివంతమైన అధికారిగా వ్యవహరించి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న 1994 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సరికొత్త రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ , పాఠశాల విద్యాశాఖల్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన ఆయన.. బ్యూరోక్రసీకి గుడ్‌బై చెప్పి క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వీఆర్ఎస్ ఇచ్చేశారు. ఆయన నిర్వాకాలు చాలా ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. తర్వాత ఆయన వీఆర్ఎస్ వెనక్కి తీసుకునేందుకు చాలా ప్రయత్నించారు. ఇంటర్యూలు ఇచ్చారు. కానీ ఏపీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. పదవీకాలం ఇంకా ఏడేళ్లు మిగిలి ఉన్నప్పటికీ విఆర్ఎస్ తీసుకోవడంతో ఏం చేయాలో తెలియక సతమతమయ్యారు. ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్ అయిన తాను టెక్నాలజీ లేదా కార్పొరేట్ రంగంలో రాణించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాసేవలో పాలుపంచుకోవాలన్న బలమైన ఆకాంక్షతోనే ఉన్నత సర్వీసును ఎంచుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక అనంతరం దేశ నిర్మాణంలో ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ పరిరక్షణ అత్యంత కీలకమని, ఆ భావజాలం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అట్టడుగు వర్గాల సంక్షేమం, విద్య, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం తన పరిపాలనా అనుభవాన్ని పూర్తిగా వినియోగిస్తానని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారిగా దశాబ్దాల పాటు పాలనా వ్యవస్థను నడిపించిన అనుభవంతో క్షేత్రస్థాయిలో ప్రజల గళాన్ని చట్టసభల్లో వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. యూపీలో రాబోయే ఎన్నికల్లో వారణాసి లేదా పూర్వాంచల్ ప్రాంతం నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.