స్వదేశానికి తిరిగి వెళ్తున్న భారతీయ దంపతులకు పొరుగింటి అమెరికన్ మహిళ ఇచ్చిన వీడ్కోలు సోషల్ మీడియా వైరల్‌

మెరికా నుంచి స్వదేశానికి తిరిగి వెళ్తున్న ఓ భారతీయ దంపతులకు వారి అమెరికన్ పొరుగింటి మహిళ ఇచ్చిన వీడ్కోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిపట్ల పెంచుకున్న అనుబంధాన్ని విడిపోతున్న క్షణంలో తట్టుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. దేశాలు వేరు అయినా మనసులు కలిస్తే ఏర్పడే బంధానికి ఈ ఘటన ఓ చక్కని ఉదాహరణగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ విజయ్ కొక్కెరగడ్డ తన ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. డెట్రాయిట్ విమానాశ్రయానికి బయలుదేరుతున్న సమయంలో ఈ భావోద్వేగ వీడ్కోలు చోటుచేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికాలో పొరుగువారిగా పరిచయమైన కుటుంబాల మధ్య కాలక్రమేణా ఎంతో సన్నిహితమైన స్నేహం ఏర్పడిందని తెలిపారు. వీడియోలో భారతీయ దంపతులు తమ ఇంటి బయట నిలబడి ఉండగా, వారి పొరుగింటి మహిళ కన్నీళ్లతో వారి వద్దకు వచ్చింది. వారిని చూడగానే గట్టిగా కౌగిలించుకుని, వారి భుజంపై తలవాల్చి ఏడ్చింది. తాను వారిని ఎంతగా మిస్ అవుతానో చెబుతూ భావోద్వేగానికి గురైంది. దంపతులు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె వారిని విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు. వారు విమానాశ్రయానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనూ ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఆ దృశ్యం చూసినవారిని సైతం కదిలించేలా సాగిన ఈ వీడ్కోలు క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిన మరో అంశం ఉంది. దంపతులకు తెలియకుండానే ఓ స్నేహితుడు మొత్తం వీడ్కోలు దృశ్యాన్ని వీడియోగా రికార్డు చేశాడు. అనంతరం ఆ వీడియోను వారికి చూపించడంతో.. తమ మధ్య ఉన్న అనుబంధానికి ఈ జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోయేలా మారిందని విజయ్ తెలిపారు. వీడియో చూసిన నెటిజన్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు ఏర్పడిన స్నేహాలు, అక్కడి కుటుంబాలతో ఏర్పడిన అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. దూరం పెరిగినా నిజమైన స్నేహం, ఆప్యాయతలు తగ్గవని పలువురు వ్యాఖ్యానించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org