ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' తొలి రెండు చరణాలు మాత్రమే పాడతాం : ముఖ్యమంత్రి డీకే శివకుమార్
కర్ణాటకలో జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపించడంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించబోమని, కేవలం తొలి రెండు చరణాలు మాత్రమే పాడతామని స్పష్టం చేశారు. "1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న ప్రతిపాదనల ప్రకారమే బహిరంగ, జాతీయ వేదికలపై మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి నేను పూర్తి బాధ్యతతో కట్టుబడి ఉంటాను" అని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. గతంలో జరిగిన ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం మొత్తం ఆరు చరణాలు ఆలపించడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనకు తెలియకుండానే ఆ నిర్ణయం జరిగి ఉండవచ్చని, ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు. వందేమాతరం గేయంలోని తరువాతి చరణాల్లో హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి, సరస్వతి దేవుళ్ల ప్రస్తావన వస్తుందని, భారత్ అనేది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం కాబట్టి ఇతర మతస్తులు లేదా వర్గాల భావోద్వేగాలను గౌరవించడానికే మొదటి రెండు చరణాలకే పరిమితం అవుతున్నామని కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. జాతీయ గేయాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దేశభక్తికి సంబంధించిన అంశాలలో ఇటువంటి సవరణలు చేస్తోందని మండిపడింది.