9,450 కోట్ల విలువైన నాలుగు భారీ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రూ. 9,450 కోట్ల విలువైన నాలుగు భారీ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టుల ద్వారా రైల్వే నెట్‌వర్క్‌కు కొత్తగా 410 కిలోమీటర్ల రైలు మార్గాలు జతకానున్నాయి. కేబినెట్ వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీకుమార్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైళ్ల రాకపోకల సామర్థ్యాన్ని పెంచడం, రద్దీని తగ్గించడం, రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టనున్నారు. వివిధ రవాణా మార్గాలను సమన్వయం చేయడంతో పాటు, సరకు రవాణాను మరింత సులభతరం చేసేలా ప్రాజెక్టులను రూపొందించారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణంతో దేశ రైల్వే నెట్‌వర్క్ సుమారు 410 కిలోమీటర్లు పెరగనుంది. దాదాపు 6,448 గ్రామాలకు రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 60 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలగనుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రయాణికుల రాకపోకలతో పాటు బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్, ఇనుము, ఉక్కు, కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాల వంటి కీలక వస్తువుల రవాణా కూడా వేగవంతం కానుందని దీంతో ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుందని వెల్లడించారు. అలాగే ఈ రైల్వే ప్రాజెక్టులతో పలు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు కనెక్టివిటీ కూడా మెరుగుపడనుందని తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org