వేలాది ఖాతాలను 24 గంటల పాటు 'అండర్ రివ్యూ'లో పెట్టిన వాట్సాప్ : తీవ్ర గందరగోళానికి గురైన వినియోగదారులు

వాట్సాప్ సోమవారం రాత్రి నుంచి భారత్ సహా పలు దేశాల్లో వేలాది ఖాతాలను ఏకంగా 24 గంటల పాటు 'అండర్ రివ్యూ'లో పెట్టింది. దీంతో ఒక్కసారిగా చాటింగ్, కాల్స్ ఆగిపోవడంతో వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో యాప్ ఓపెన్ చేసిన వినియోగదారులకు స్క్రీన్ పై ఒక అరుదైన మెసేజ్ కనిపించింది. "మీ అకౌంట్ నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి మీ సమాచారం, కార్యకలాపాలను సమీక్షిస్తున్నాం.. 24 గంటల్లోగా ఫలితాన్ని తెలియజేస్తాం" అంటూ వాట్సాప్ సందేశం ఇచ్చింది. అంతేకాకుండా 'బాధ్యతాయుతంగా వాట్సాప్ వాడే విధానం' పై గైడ్‌లైన్స్ లింక్‌లను చూపించింది. సమీక్ష పూర్తయ్యే వరకు ఎలాంటి మెసేజ్ పంపడానికి లేదా కాల్స్ మాట్లాడటానికి వీలు లేకుండా యాప్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. ఏ తప్పు చేయకపోయినా, ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండా ఖాతాలను ఉన్నపళంగా లాక్ చేయడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను వ్యక్తం చేశారు. నిమిషాల్లో చాటింగ్, ఆఫీస్ కమ్యూనికేషన్స్ అన్నీ ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఎక్స్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాట్సాప్ నియమావళిని ఎక్కడ ఉల్లంఘించామో చెప్పకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గందరగోళంపై వాట్సాప్ అధికారిక ప్రతినిధి స్పందించారు. వేధింపులు, నిబంధనల ఉల్లంఘనలను అడ్డుకోవడానికి తమ వద్ద ఉన్న ఆటోమేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ నిరంతరం పనిచేస్తుంటాయని తెలిపారు. అయితే, కొన్నిసార్లు ఈ ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ తప్పుడు అంచనా వల్ల నిజమైన వినియోగదారుల ఖాతాలు కూడా పరిశీలనలోకి వెళ్తుంటాయని అంగీకరించారు. ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు సాధ్యమైనంత త్వరగా గుర్తించి, ఖాతాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే సాంకేతిక లోపం వల్ల ఎంతమంది ఖాతాలు ప్రభావితమయ్యాయనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org