సర్వీస్‌, లావాదేవీల కాల్స్‌కి 1601 సిరీస్‌ నంబర్లను మాత్రమే ఉపయోగించాలి : ట్రాయ్‌ ఆదేశాలు జారీ

దేశంలో బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలు కాకుండా ఇతరత్రా సంస్థలు తమ కస్టమర్లకు చేసే సర్వీస్, లావాదేవీల కాల్స్‌కి 1601 సిరీస్‌ నంబర్లను మాత్రమే ఉపయోగించాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదేశించింది. తొలి దశలో కరెంటు, తాగు నీరు, సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల్లాంటి యుటిలిటీలు, కొరియర్, లాజిస్టిక్స్‌ రంగ సంస్థలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ నంబర్‌ సిరీస్‌ని ప్రమోషనల్‌ వాయిస్‌ కాల్స్‌కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. విశిష్ట నంబరు సిరీస్‌ కావడం వల్ల చట్టబద్ధమైన సర్వీస్, లావాదేవీ కాల్స్‌ని గుర్తించడం యూజర్లకు కూడా సులభతరంగా ఉంటుందని ట్రాయ్‌ పేర్కొంది. తొలి దశ కింద అర్హత కలిగిన సంస్థల వివరాలను టెల్కోలు ధృవీకరించుకుని 90 రోజుల్లోగా 1601 సిరీస్‌కి మైగ్రేషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్లను మధ్యవర్తులు లేదా అగ్రిగేటర్లకు కాకుండా, దరఖాస్తుదారులకు టెల్కోలు నేరుగా కేటాయిస్తాయి. ప్రస్తుతం బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) రంగం, ప్రభుత్వ సంస్థలు 1600 సిరీస్‌ని ఉపయోగిస్తున్నాయి. ప్రమోషనల్‌ కాల్స్‌ కోసం అన్ని రంగాల సంస్థలు 140 సిరీస్‌ని ఉపయోగిస్తున్నాయి. ఈ రెండు సిరీస్‌ల నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌లో స్పామ్‌ కాల్స్‌ కూడా ఉండటం, చాలా మటుకు నంబర్లను ట్రూకాలర్‌లాంటి యాప్‌లు స్పామ్‌ కింద ట్యాగ్‌ చేస్తుండటమనేది ట్రాయ్, కాలర్‌ ఐడీ యాప్‌ల మధ్య వివాదానికి దారి తీసింది. 140 సిరీస్‌ నుంచి వచ్చే కాల్స్‌ని యూజర్లు బ్లాక్‌ చేయదల్చుకుంటే, ట్రాయ్‌ అధికారిక యాప్‌లోని డు నాట్‌ డిస్టర్బ్‌ (డీఎన్‌డీ) ఫీచరును ఉపయోగించుకోవాలని డిస్‌ప్లే చేయాలంటూ ట్రూకాలర్‌కి ట్రాయ్‌ సూచించింది. బీఎఫ్‌ఎస్‌ఐ రంగ నియంత్రిత సంస్థలు.. తమ కస్టమర్లకు, ప్రభుత్వ సంస్థలు పౌరులకు కీలకమైన సేవల వివరాలు, లావాదేవీల వివరాలను తెలియజేయడానికి ఉపయోగించే 1600 సిరీస్‌ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాగ్‌ చేయకూడదంటూ కాల్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌లు, యూజర్లకు ట్రాయ్‌ సూచించింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org