ఆసుపత్రిలో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం : 15 మంది నవజాత శిశువులు దుర్మరణం
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని 'పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' లో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని గైనకాలజీ అండ్ మెటర్నల్-చైల్డ్ కేర్ విభాగానికి చెందిన నవజాత శిశు సంరక్షణ కేంద్రం వార్డులో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పేలడం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. మంటలు, దట్టమైన పొగ క్షణాల్లోనే గది అంతటా వ్యాపించడంతో నర్సరీలో చికిత్స పొందుతున్న సుమారు 15 మంది పసికందులు ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో మొత్తం 16 మంది నవజాత శిశువులు ఉండగా, సహాయక సిబ్బంది కేవలం ఒక్క శిశువును మాత్రమే సురక్షితంగా రక్షించగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చాయి. పుట్టిన కొద్ది రోజులకే పసికందులు అగ్నికి ఆహుతి కావడంతో ఆసుపత్రి ప్రాంగణంలో బాధిత తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ తీవ్ర దుర్ఘటనపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తేల్చేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.