Ad Code

ప్రతిపక్ష నేతల అరెస్టు రాజ్యాంగాన్ని అవమానించడమే : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువతపై పోలీస్ దమనకాండను వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. హన్మకొండ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులతో కలిసి భట్టి విక్రమార్క బుధవారం నిరసన తెలిపారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలో యువతపై జరిగిన పోలీస్ దమనకాండను వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించడమేనని భట్టి అన్నారు. 'నీట' ప్రశ్నా పత్రాల లీకేజీతో దేశంలోని కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ అక్రమాలపై ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తున్న అమాయక విద్యార్థులు, ఆడపిల్లల పట్ల పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి, లాఠీఛార్జి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని, ప్రశ్నించిన వారిపై దాడులు, అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. దేశ యువత భవిష్యత్తు కోసం, విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ దిక్సూచిలా నిలిచి పోరాడుతున్నారన్నారు. లాఠీలతో విద్యార్థుల గొంతును, అరెస్టులతో రాహుల్ గాంధీ పోరాటాన్ని ఆపలేరని, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆఖరి వరకు పోరాడతాయని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ పోరాటానికి దేశంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు మద్దతుగా పోరాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్ నాయకులు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరమ్మ విగ్రహం నుండి లోక్ భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తన అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మంత్రి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా దేశ యువతకు క్షమాపణలు చెప్పాలని, 'నీట' పేపర్ లీక్‌తో 21మంది విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యార్థులపై లాఠీచార్జికి కారణమైన హోంమంత్రి అమిత్ షాని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu