పావురాల ఆహార నియంత్రణపై ఏం చర్యలు తీసుకున్నారు ? : అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌  నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంతో ప్రజారోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందన్న అంశంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తదితర ప్రతివాద అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది. పావురాల కారణంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ముషీరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రాధేశ్యామ్‌ తపాడియా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని  దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ న్యాయవాది దీపక్‌ మిశ్రా వాదనలు వినిపిస్తూ హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాల్లోని నివాస కాలనీలు, ఆసుపత్రులు, ప్రజా ప్రదేశాలు, చారిత్రక కట్టడాల వద్ద పావురాలకు నిర్బంధం లేకుండా ఆహారం వేయడంతో ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యం పెరుగుతున్నాయన్నారు. అనుమతి లేకుండా ఆహారం వేస్తున్న వారిపై జరిమానాలు విధించేలా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. పావురాలకు ఆహారం వేయడాన్ని నియంత్రించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను తెలియజేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org