జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే : ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ దుష్ప్రచారానికి భారత్ మరోసారి గట్టి సమాధానమిచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే విదేశాంగ విధానంగా మార్చుకున్న పాకిస్థాన్, భారత్‌పై చేస్తున్న నిందారోపణలను తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, దానిని భారత్ నుంచి విడదీయడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేసింది.భద్రతా మండలిలో జరిగిన ఉన్నత స్థాయి చర్చలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ పాక్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఒక ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగిస్తోందని, అలాంటి దేశంతో పరస్పర విశ్వాసం లేదా సద్భావనను ఆశించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. సింధూ నదీ జలాల ఒప్పందంపై భారతదేశ వైఖరి అత్యంత స్పష్టంగా మరియు స్థిరంగా ఉందన్నారు. ఉగ్రవాదం కొనసాగుతున్నంత కాలం సహకారం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ విడదీయరాని భారత భూభాగమని, దానిపై ఎలాంటి వివాదాలకు తావులేదని పునరుద్ఘాటించారు.