Ad Code

ముంబైలో రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగుతున్న విద్యార్థులు : వాట్సాప్ నోటీసులు, ఇళ్లలో తనిఖీలు..!

నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఇప్పుడు ముంబై సహా ప్రధాన నగరాలను తాకాయి. ఢిల్లీ తరహాలోనే విద్యార్ధులు ముంబైలోనూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. విద్యార్ధుల నిరసనల్ని మొగ్గలోనే తుంచేసేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగా ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్ధుల వివరాలను సేకరించి ట్రాక్ చేయడం ప్రారంభించింది. ముంబై పోలీసులు ఇప్పటికే నగరంలో ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్ధులకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపడం ప్రారంభించారు. వీరిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు పంపుతున్నారు. అలాగే విద్యార్ధులను వారి మొబైల్ నంబర్ల ఆధారంగా ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. అలాగే వారి ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేపడుతున్నారు. తద్వారా విద్యార్ధుల్ని నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లు లేదా గతంలో లీగల్ నోటీసులు అందుకున్న నిరసనకారులకు, స్థానిక పోలీస్ స్టేషన్ల నుండి నేరుగా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. అలాగే వాట్సాప్ లో మెసేజ్ లు కూడా వస్తున్నట్లు విద్యార్ధులు చెప్తున్నారు. పోలీసులు వారిని ఇళ్లలోనే ఉండమని సూచిస్తున్నారు. అలాగే తమ ఆదేశాలను పాటిస్తున్నారో లేదో నిర్ధారించుకోవడానికి వారి వాట్సాప్ లైవ్ లొకేషన్‌ను నిరంతరం షేర్ చేయమని ఆదేశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 35(3) కింద, తెల్లవారుజామున వివిధ మెసేజింగ్ యాప్ ల ద్వారా డిజిటల్‌గా లీగల్ నోటీసులు పంపుతున్నారు. గతంలో జరిగిన సమావేశాలకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో ఆదేశాలు ఇస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu