షాబాద్ సామూహిక హత్యల కేసు : 48 గంటలు గడుస్తున్నా దొరకని నిందితుడి ఆచూకీ
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు తన భార్యాపిల్లలను కలిపి మొత్తం ఆరుగురిని అత్యంత దారుణంగా నరికి చంపిన నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్ పార్వతి (29) కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘోర నరమేధం జరిగి 48 గంటలు గడుస్తున్నా నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే, ఈ దారుణ కాండ తర్వాత నిందితుడు ఆత్మహత్యకు ప్రయత్నించి, చివరి నిమిషంలో మనసు మార్చుకుని రైలు పట్టాలపై నుంచి పక్కకు దూకేసి తప్పించుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హత్యల అనంతరం నిందితుడు రాజ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై నిలబడినట్లు పోలీసులు గుర్తించారు. రైలు వేగంగా దూసుకువస్తున్న సమయంలో.. చివరి క్షణంలో భయపడి పట్టాలపై నుంచి పక్కకు దూకేసి, అక్కడి నుంచి జాతీయ రహదారి వైపు పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా స్పష్టమైంది. ఈ కేసులో నిందితుడి కదలికలను గుర్తించేందుకు ఈ ఫుటేజీ అత్యంత కీలక ఆధారంగా మారింది. నిందితుడు ముందస్తు ప్లాన్ ప్రకారమే, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తన స్వంత వాహనాన్ని కాకుండా షాద్‌నగర్ నుంచి అద్దె కారును (సెల్ఫ్ డ్రైవ్ కార్) తీసుకువచ్చినట్లు తేలింది. హత్యకు వాడిన పాత చాకుపై తుప్పు పట్టి ఉండటాన్ని బట్టి, ఆయుధాన్ని చాలా రోజుల ముందే సమకూర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు తనను పట్టుకోకుండా ఉండేందుకు నిందితుడు ఏకంగా 4 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను ఉపయోగించినట్లు విచారణలో తేలింది. జూలై 10వ తేదీ అర్ధరాత్రి 11:50 గంటల ప్రాంతంలో తన చివరి యాక్టివ్ ఫోన్‌ను కూడా స్విచ్ఛాఫ్ చేసినట్లు గుర్తించారు. తిమ్మాపూర్ స్టేషన్ వద్ద కారులో ఇంధనం అయిపోవడంతో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. నిందితుడి వద్ద పెద్దగా డబ్బులు లేవని, గతంలో అతడు శ్రీశైలంలో గడిపినట్లు సమాచారం ఉండటంతో పోలీసులు శ్రీశైలం రూట్‌తో పాటు హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పొడవునా ఉన్న హోటళ్లు, లాడ్జీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను జల్లెడ పడుతున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 'ఫ్యూచర్ సిటీ' పోలీసులు రూ.2 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఈ ఘోర సామూహిక హత్యల వెనుక పాత కక్షలు ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది మే నెలలో సదరు మైనర్ బాలిక కుటుంబ సభ్యులు రాజ్‌కుమార్‌పై వేధింపుల ఆరోపణలతో షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మే 16న అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లిన రాజ్‌కుమార్, ఇటీవల ముందస్తు బెయిల్ (యాంటిసిపేటరీ బెయిల్) పై బయటకు వచ్చాడు. తనపై కేసు పెట్టినందుకే కక్ష పెంచుకుని బాలిక, ఆమె తల్లి, అమ్మమ్మలను దారుణంగా చంపాడు. అంతేకాకుండా, బాలికను ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి మరీ చంపడం వెనుక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, నిందితుడి నుంచి తమకు ముప్పు ఉందని బాధితురాలి కుటుంబం గతంలో మొరపెట్టుకున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు రావడంతో షాబాద్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ దారుణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేత స్వతంత్ర విచారణకు ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ పర్యవేక్షణలో స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపును తీవ్రం చేశాయి.