జమ్మూ కాశ్మీర్ మా అంతర్గత వ్యవహారం : ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌ను ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా తప్పుబట్టారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటూ వస్తోందని, ఇకపై కూడా అలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇది పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారం అన్నారు. భద్రతా మండలి 'అరియా-ఫార్ములా' సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రతినిధి హరీష్.. పాకిస్థాన్ ప్రతినిధి, సమావేశ సహ-అధ్యక్షుడి వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని ఆశించిన సహ-అధ్యక్షుడే ఈ వేదికను రాజకీయీకరించడం ఎంతో ఆశ్చర్యకరమని భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. సమయాభావం దృష్ట్యా.. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని, అందులో ఎటువంటి జోక్యాన్నీ సహించేది లేదని స్పష్టం చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తదనంతరం 'X' సోషల్ మీడియా వేదికపై ఆయన స్పందిస్తూ.. సహ-అధ్యక్ష దేశంగా ఉన్నప్పటికీ పాకిస్థాన్ తన హుందాతనాన్ని కోల్పోయి, భారత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి అనవసరమైన వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన యుద్ధ హెచ్చరికకు న్యూఢిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల శాఖ గతంలోనే గట్టిగా స్పందించిందన్న విషయాన్ని గమనించాలి. తమ దేశీయ వైఫల్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకే పాకిస్థాన్ ఇలాంటి నిరాశాజనకమైన బెదిరింపులకు పాల్పడుతోందని భారత్ పేర్కొంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేసిన నిష్ప్రయోజనకరమైన ప్రయత్నం మాత్రమేనని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఆ కల్పిత వాదనలను మేము పూర్తిగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.