ఆంధ్రా యూనివర్సిటీలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచాలి : ఏయూ వీసీకి సీఎం చంద్రబాబు సూచన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనలో భాగంగా శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం “నెట్ జీరో” కార్యక్రమంలో భాగంగా సైకిల్‌పై ప్రయాణిస్తూ ఏయూ క్యాంపస్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజశేఖర్‌కు సీఎం చంద్రబాబు చురకలంటించారు. వందేళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ అయిన ఆంధ్రా యూనివర్సిటీలో పచ్చదనం కేవలం 25 శాతం మాత్రమే కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో దాదాపు 90 శాతం గ్రీన్ కవర్ ఉండగా, ఏయూలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. యూనివర్సిటీ పరిపాలన మరింత బాధ్యతగా వ్యవహరించి క్యాంపస్‌లో పచ్చదనాన్ని గణనీయంగా పెంచాలని ఏయూ వీసీకి సీఎం సూచించారు. ఆంధ్రా యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శవంతమైన విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక బ్లూప్రింట్ రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిపుణుల బృందం సూచనల మేరకు పర్యావరణ హిత విధానాలను అమలు చేసి, దేశంలోని టాప్-20 గ్రీన్ యూనివర్సిటీలలో ఏయూకు స్థానం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యా వాతావరణాన్ని అందించేందుకు యూనివర్సిటీ పరిధిలో బయోడైవర్సిటీ పార్క్‌ను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రకృతికి దగ్గరగా ఉండే విద్యా వాతావరణం విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ కవర్‌ను 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.