దేశంలో బట్టలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొంటున్నట్టుగా టూవీలర్లను కూడా ఆన్‌లైన్‌లో కొనేవాళ్లు ఎక్కువయ్యారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, తమ వేదికపై ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏడాది వ్యవధిలో రెండింతలు పెరిగాయని, ముఖ్యంగా మెట్రో నగరాల కంటే టయర్-2, టయర్-3 పట్టణాల నుంచే ఎక్కువ డిమాండ్ నమోదవుతోందని పేర్కొంది. కంపెనీ ప్రకారం ప్రతి ముగ్గురు కొనుగోలుదారుల్లో ఇద్దరు చిన్న నగరాలు, పట్టణాల నుంచే వస్తున్నారు. రోజువారీ ప్రయాణాల కోసం కమ్యూటర్ బైక్‌లతో పాటు ప్రీమియం మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో 20కిపైగా బ్రాండ్లకు చెందిన వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ట్రయంఫ్, కేటీఎం, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో ఆన్‌లైన్ కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి. దక్షిణాదిన కాకినాడ, తిరుపతి, నెల్లూరు నగరాల్లో ద్విచక్ర వాహన బుకింగ్స్ 12 రెట్లు పెరిగినట్లు అమెజాన్ వెల్లడించింది. ఉత్తరాన నాగౌర్, జింద్, అలాగే పశ్చిమాన రాజ్‌కోట్, జామ్‌నగర్ వంటి నగరాల్లో కూడా బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి. చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులు, ఇంటర్నెట్ విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా టయర్-3 పట్టణాలకు చెందిన 2,300కు పైగా వినియోగదారులు అమెజాన్ ద్వారా తొలిసారిగా టూవీలర్ కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. షోరూంకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ధరలు పోల్చుకోవడం, ఫైనాన్స్ ఆప్షన్లు చూడటం, డిజిటల్ పేమెంట్లతో బుకింగ్ చేయడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. దేశీయ టూవీలర్ మార్కెట్‌లో కూడా ప్రీమియం, ఎలక్ట్రిక్ వాహనాల వాటా క్రమంగా పెరుగుతోంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం, 2025లో భారత టూవీలర్ విక్రయాలు రెండు కోట్ల యూనిట్లను దాటగా, 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ అమ్మకాలు 2.14 కోట్ల యూనిట్లకు చేరి 13%కు పైగా వృద్ధి నమోదు చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రీమియం మోటార్‌సైకిళ్లు ఈ వృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా నిలిచాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు మొత్తం మార్కెట్‌లో చిన్న వాటానే కలిగి ఉన్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో ఈ విభాగం వేగంగా విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిన్న పట్టణాల్లో డిజిటల్ అవగాహన పెరగడం, విస్తృత బ్రాండ్ ఎంపికలు, ధరల్లో పారదర్శకత కారణంగా భవిష్యత్తులో టూవీలర్ కొనుగోలు అనుభవం పూర్తిగా ఆన్‌లైన్ వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది.
0 Comments