హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కాలమంతా ఒక ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ లాంటిదని, హైదరాబాద్‌లో ఈ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఇల్లు కట్టలేదు సరే కదా, కనీసం ఒక ఇటుక కూడా పెట్టలేదని మండిపడ్డారు. శని, ఆదివారాలు వస్తే చాలు హైడ్రా పేరుతో పేదల, సామాన్యుల వందలాది ఇళ్లను కూలగొడుతూ సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు కేవలం సున్నాలు వేసి, తామే కట్టించామంటూ కాంగ్రెస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగులను, మహిళలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి చాయ్ తాగుతూ నిరుద్యోగుల ముందు ఫోజులు కొట్టారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం 4 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం ఊసే లేదన్న కేటీఆర్ "రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు బాకీతో సహా పోయిన రెండున్నర సంవత్సరాలు, రాబోయే రెండున్నర సంవత్సరాల హామీ డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ డబ్బులు ఇస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా" అంటూ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని రేవంత్ రెడ్డిని నిలదీస్తూ తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నాయకులనే వెన్నుపోటు పొడుస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మినబంటు, నిజాయితీపరురాలైన ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి ఇక్కడ భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నారనే నిజాన్ని రాహుల్ గాంధీకి చేరవేసిందని పేర్కొన్నారు. ఆ కక్షతోనే మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో దొంగ కేసులు పెట్టించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎంత దారుణమైన వ్యక్తి అంటే తన సొంత పార్టీలోని అంతర్గత కేసుల విషయాన్ని తీసుకెళ్లి బీజేపీ వాళ్లకు చెప్పి, కాంగ్రెస్ నేతలకే గుండు కొట్టి శఠగోపం పెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక 'దివానా గాడు' అని, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ తనకు హిట్లర్ ఆదర్శం అని చెప్పుకోవడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డికి కనుక ఛాన్స్ ఇస్తే జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి పేరు కూడా మార్చేస్తాడని దుయ్యబట్టారు. ఖైరతాబాద్ నియోజకవర్గ రాజకీయాలపై స్పందిస్తూ.. ఇక్కడి నుంచి బిఆర్ఎస్ జెండాపై గెలిచి, పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరిగిన దానం నాగేందర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఆయన ఘోరంగా ఓడిపోయారని కేటీఆర్ గుర్తుచేశారు. ఖైరతాబాద్‌లో ఈసారి దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి ఊడటం ఖాయమని, ఇక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నికలు (ఎలక్షన్స్) వస్తాయని జోస్యం చెప్పారు. గతంలో ఖైరతాబాద్‌పై రెండుసార్లు గులాబీ జెండా ఎగరేసిన చరిత్ర బిఆర్ఎస్‌కు ఉందని, రాబోయే ఎన్నికల్లోనూ ఇక్కడ కారు గుర్తుదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకున్నారని, కానీ తెలంగాణలో కొంతమంది నమ్మి నెత్తిన రుద్దుకున్నారని, ఈ రెండేళ్లు భరించక తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
0 Comments