ప్రపంచ పర్యావరణ దినోత్సవం : 10 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ తొక్కారు. కాలుష్య రహిత సమాజం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. పర్యావరణ హితమైన రవాణా మార్గాలను ప్రోత్సహించడం, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఆయన ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం ఆయన విశాఖపట్నంలో సుమారు 10 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కారు. ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఈ సైకిల్ ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. నొవొటెల్ వరకూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. మధ్యలో ఒకట్రెండు సార్లు బ్యాలెన్స్ తప్పారు గానీ ఆయన కింద పడకుండా భద్రత సిబ్బంది సకాలంలో స్పందించగలిగారు. ఈ సైకిల్ ర్యాలీలో మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు, వేలాదిమంది స్థానికులు పాల్గొన్నారు. చంద్రబాబుతో కలిసి సైకిల్ తొక్కారు. పౌరులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు సైకిల్ లేదా ఈ-సైకిల్ వినియోగించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు ఇదివరకే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ అనేది ఒకరి బాధ్యత కాదని, ఇది సమాజంలోని ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రకృతిని కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్తు తరాలకు సురక్షితమైన జీవనాన్ని అందించగలమని పేర్కొన్నారు. గాలి, నీరు, మట్టి కాలుష్యాన్ని అరికట్టేలా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవనశైలిని మార్చుకోవాలని, ప్రకృతిని కాపాడుకోవడాన్ని తమ అలవాటు చేసుకోవాలని సూచించారు. "ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు సైకిళ్లు తొక్కుదాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటుదాం.." అని నినదించారు. ఏపీని పచ్చని రాష్ట్రంగా మార్చడంలో భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర ప్రజలందరికీ సూచించారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇదే క్రమంలో, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు మరియు గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రకృతి వనరులను కాపాడటంతో పాటు, అందరూ కలిసికట్టుగా పనిచేసి సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org