ఎల్ఐసీలో మరోసారి వాటాల విక్రయం ?
ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం మరో విడత వాటాల విక్రయానికి సిద్ధమవుతోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, జూన్ చివర్లో లేదా జూలై ప్రారంభంలో సుమారు 2 శాతం వాటాను సంస్థాగత పెట్టుబడిదారులకు విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆఫర్ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 10,000 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ డీల్‌పై కసరత్తు కొనసాగుతోందని సమాచారం. ఈ భారీ లావాదేవీ నిర్వహణ కోసం గోల్డ్‌మన్ శాక్స్, బీఎన్‌పీ పరిబాస్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలతో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కలిసి పనిచేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నందున, డీల్ మొత్తం, టైమ్‌లైన్‌లో మార్పులు ఉండొచ్చని స్పష్టం చేశాయి. 2022లో ఐపీఓ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించి సుమారు రూ. 21,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఎల్ఐసీలో 96.5 శాతం వాటా ఉంది. సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను 2032 నాటికి 25 శాతం పెంచాల్సి ఉండటంతో, ప్రభుత్వం దశలవారీగా వాటాల విక్రయం చేపట్టనుంది.