భారత్‌లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటుకు విదేశీ సంస్థలు పోటీ !


భారత్‌లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు విదేశీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 9.1 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) కార్యాలయ స్థలాలను (ఆఫీస్‌ స్పేస్‌) జీసీసీల ఏర్పాటుకు విదేశీ సంస్థలు టాప్‌-9 నగరాల్లో తీసుకున్నట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ తెలిపింది. ఒక త్రైమాసికంలో జీసీసీలకు సంబంధించి ఇదే గరిష్టమని పేర్కొంది. మార్చి త్రైమాసికంలో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ ఈ నగరాల్లో 5 శాతం పెరిగి 20.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. 2025 మొదటి మూడు నెలల్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 19.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా, అహ్మదాబాద్, కోచి నగరాల డేటాను ఈ నివేదికలో సీబీఆర్‌ఈ ప్రస్తావించింది. జీసీసీ లీజింగ్‌ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదు కావడం అన్నది సంక్లిష్టమైన సామర్థ్య కార్యకలాపాలకు భారత్‌ అంతర్జాతీయ కేంద్రంగా అవతరిస్తుండడానికి సంకేతమని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్‌ మేగజిన్‌ తెలిపారు. ఏదో ఒక రంగానికే ఈ డిమాండ్‌ పరిమితం కాలేదని, ఈ-కామర్స్, టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ ఇలా ఎన్నో రంగాల్లో నెలకొన్నట్టు చెప్పారు. టాప్‌-9 నగరాల్లో జీసీసీలకు సంబంధించి తీసుకున్న లీజింగ్‌లో 73 శాతం అమెరికా సంస్థల నుంచే ఉన్నట్టు సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. పర్యావరణ అనుకూలమైన సర్టిఫికేషన్, మెరుదైన సదుపాయాలు ఉన్న వాటికి కిరాయిదారులు ప్రాధాన్యమిస్తున్నట్టు సీబీఆర్‌ఈ ఎండీ (లీజింగ్‌ సర్వీసెస్‌) రామ్‌ చందానీ తెలిపారు. జీసీసీలు బహుళ కార్యకలాపాలకు సంబంధించి ఆవిష్కరణల కేంద్రాలుగా మారుతున్నాయని, ఏఐ అనుకూల కార్యాలయ వ్యూహాలను సంస్థలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. టాప్‌-9 నగరాల్లో బెంగళూరులో ఆఫీస్‌ లీజింగ్‌ 29 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ 22 శాతం, ముంబైలో 16 శాతం వాటా కలిగి ఉన్నాయి. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org