తెలంగాణలో బీఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజుల పెంపు
తెలంగాణలో బీఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజులను భారీగా పెంచుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ పంపిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో నంబరు 10ని విడుదల చేసింది. ఈ పెంపుతో వందలాది విద్యాసంస్థల్లో ఫీజులు సామాన్యులకు భారంగా మారనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 120 బీఫార్మసీ కళాశాలలు ఉండగా, వాటిలో గతంతో పోలిస్తే 10 నుంచి 15 శాతం వరకు ఫీజులు పెరిగాయి. గరిష్ఠంగా ఒక విద్యార్థి ఏడాదికి రూ. 1.21 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కేవలం మూడు కాలేజీల్లోనే లక్ష రూపాయల పైచిలుకు ఫీజు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 103 కళాశాలల్లో ఫీజు రూ. 50 వేలు దాటగా, కేవలం 17 విద్యాసంస్థల్లో మాత్రమే రూ. 45 వేల నుంచి రూ. 49,500 లోపు ఫీజులు ఉన్నాయి. ఫార్మా-డీ కోర్సుకు గతంలో ఉన్న రూ. 1.25 లక్షల గరిష్ఠ ఫీజు ఇప్పుడు రూ. 1,37,500కి చేరింది. రాష్ట్రంలోని 79 ఫార్మా-డీ కాలేజీల్లో 13 చోట్ల ఫీజు లక్ష రూపాయలకు పైగా ఉంది. ఈ కోర్సులో కనిష్ఠ ఫీజుగా రూ. 68 వేలను ప్రభుత్వం నిర్ణయించింది. అటు బీఆర్క్ (ఆర్కిటెక్చర్) విభాగంలో ఉన్న 8 కళాశాలల్లో అశోకా కళాశాల ఫీజు అత్యధికంగా రూ. 1.32 లక్షలుగా ఖరారైంది.