టీఆర్‌పీ రేటింగ్స్‌ను నిలిపివేయాలని న్యూస్ ఛానళ్లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ


దేశంలోని న్యూస్ టీవీ ఛానళ్లకు సంబంధించిన టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ లను నాలుగు వారాల పాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిస్థితులపై కొన్ని టీవీ న్యూస్ ఛానళ్లు అతిశయోక్తులతో కూడిన వార్తలు, ఊహాగానాలతో కూడిన విశ్లేషణలు ప్రసారం చేస్తున్నట్లు ప్రభుత్వం గమనించింది. ఇలాంటి వార్తలు ప్రజల్లో అనవసర భయాందోళనలు, గందరగోళం సృష్టించే ప్రమాదం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఉన్న భారతీయులు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే న్యూస్ ఛానళ్లకు సంబంధించిన టీఆర్‌పీ రేటింగ్స్‌ను నిలిపివేయాలని, నాలుగు వారాల పాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని ప్రకటించవద్దని సూచించింది. 2014లో జారీ చేసిన టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీల మార్గదర్శకాల ప్రకారం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇచ్చే ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే నిబంధనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. టీఆర్‌పీ రేటింగ్స్ కోసం ఛానళ్లు పోటీ పడుతూ సంచలనాత్మక వార్తలను ప్రసారం చేయకుండా నిరోధించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాలుగు వారాల పాటు రేటింగ్స్ నిలిపివేయడం ద్వారా వార్తల ప్రసారంలో బాధ్యతాయుత వైఖరి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే టీఆర్పీ రేటింగులను నిలిపివేయడం ఇది మొదటిసారి కాదు. 2020లో వెలుగులోకి వచ్చిన 'టీఆర్పీ స్కామ్' సమయంలో కూడా దాదాపు మూడు నెలల పాటు న్యూస్ ఛానళ్ల రేటింగ్స్‌ను బార్క్ నిలిపివేసింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org