భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రణాళికలు : భద్రతా దళాల అదుపులో ఎనిమిది మంది
పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాద సంస్థల భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రణాళికలను వేసిన ఎనిమిది మంది ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఆరుగురిని తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో, మరో ఇద్దరిని పశ్చిమ బెంగాల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడిన వారిలో కొందరు బంగ్లాదేశీయులు ఉన్నారని, వీరంతా నకిలీ ఆధార్ కార్డులతో తమ స్వస్థలాలను దాచిపెట్టి, దేశంలో చొరబడినట్లు దర్యాప్తులో తేలింది. వీరు తమిళనాడులోని గార్మెంట్ తయారీ యూనిట్లలో కార్మికులుగా చలామణి అవుతూ, రహస్యంగా ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నట్లు ప్రత్యేక విభాగం అధికారులు గుర్తించారు. ఈ భారీ కుట్ర వెనుక విదేశాల్లో తలదాచుకున్న హ్యాండ్లర్ల హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంటూ ఈ ఎనిమిది మందిని భారత్‌లో ఆపరేట్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు నిర్ధారించాయి. నిందితుల నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, పదహారు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిలోని డిజిటల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు, చారిత్రక కట్టడాలే లక్ష్యంగా లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఐఈడీ దాడులకు ప్లాన్ చేస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.