డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య కేసు : పోలీసు అధికారులు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ లో గత వైకాపా ప్రభుత్వంలో తన వద్ద పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుతో కుమ్మక్కైన పోలీస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ కేసును నీరుగార్చేందుకు నిందితుడితో చేతులు కలిపిన పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గత 2022లో జరిగిన ఈ హత్య కేసు దర్యాప్తులో నిందితుడైన అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఈ వేటు పడింది. ఈ కేసు విచారణ "పోలీసు అధికార వర్గాల కుమ్మక్కుకు స్పష్టమైన ఉదాహరణ" అని ఫిబ్రవరి 20న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఛార్జిషీట్ దాఖలులో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి, నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా పోలీసులు సహకరించారని కోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో, కేసులో కీలక ఆధారాలను విస్మరించి నిందితుడైన అనంతబాబుకు సహకరించిన నలుగురు పోలీస్ అధికారులపై డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెండ్ అయిన వారిలో కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన అప్పటి కాకినాడ డీఎస్పీ, ప్రస్తుతం భీమవరం అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న వి. భీమారావు, వెయిటింగులో ఉన్న డీఎస్పీ మురళీకృష్ణా రెడ్డి, అప్పట్లో సర్పవరం సీఐగా పనిచేసి ప్రస్తుతం కోనసీమ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆకుల మురళీకృష్ణ, అప్పట్లో సర్పవరం స్టేషన్ ఎస్ఐగా ఉన్న ఎన్.సతీష్ బాబు ఉన్నారు. వీరిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని, 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రభుత్వం ఆదేశించింది.