అటల్ పెన్షన్ యోజన పథకం మరో ఐదేళ్ల పాటు పొడిగింపు !
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అటల్ పెన్షన్ యోజన గడువును 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగంలోని కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అసంఘటిత రంగంలో పనిచేసే వారు తమ వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు 2015 మే 9న కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చందాదారులు 60 ఏళ్లు నిండిన తర్వాత వారు చెల్లించిన చందాను బట్టి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస హామీతో కూడిన పెన్షన్‌ను పొందుతారు. ఈ పథకం ఇకపై 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది.ఈ పథకం వ్యాప్తిని పెంచడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి, గ్యాప్ ఫండింగ్ కోసం కేంద్రం నిధుల మద్దతును కూడా పొడిగించింది. జనవరి 19, 2026 నాటికి ఈ పథకంలో సుమారు 8.66 కోట్ల మంది పైగా చందాదారులు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులకు చేరువ కావడానికి ప్రభుత్వం సామర్థ్య పెంపుదల, అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోనున్నారు.