అర్హత లేని 5.74 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసి భూ దోపిడీకి తెరలేపారు !
జగన్ సర్కార్ చేసింది భూ సర్వే కాదని, అదో వివాదాల పుట్ట అంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం డేటా ట్రాన్స్‌ఫర్ లో విఫలమై వెబ్లాండ్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని, ఆ క్రెడిట్ మాత్రం జగన్ కే దక్కుతుందని ఎద్దేవా చేసారు. అర్హత లేని 5.74 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసి భూ దోపిడీకి తెరలేపారన్నారు. పట్టాదారు పుస్తకాలపై ఫోటోల కోసం రూ. 700 కోట్లు ఖర్చు చేయడం దుర్మార్గమని విమర్శించిన ఆయన భూ రీసర్వే అంశంపై జగన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవాలని చూడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేసారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థపై కనీస అవగాహన లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఈ ప్రయోగం వల్ల ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భూ యజమానులు, సామాన్య రైతులు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాను ఉదాహరణగా చూపిస్తూ, అక్కడ గత 18 నెలలుగా తాను వ్యక్తిగతంగా జరిపిన సమీక్షలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయన్నారు. జిల్లాలో ఉన్న మొత్తం రెవెన్యూ సమస్యల్లో 70 శాతం కేవలంజగన్ సర్కార్ అస్తవ్యస్తంగా నిర్వహించిన రీసర్వే వల్లే తలెత్తాయని విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి పారదర్శక రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ.. అధికారులకు శిక్షణ ఇవ్వకుండా, తగిన సమయం కేటాయించకుండా బలవంతంగా రీసర్వేను రుద్దడం వల్ల వ్యవస్థ మొత్తం గందరగోళంలో పడిందన్నారు. వలస వెళ్లిన రైతుల భూములను సైతం పట్టించుకోకుండా లక్షలాది జాయింట్ ఎల్పీఎంలు సృష్టించి, రైతుల ఆస్తులను చిక్కుల్లో నెట్టేశారన్నారు. వెబ్లాండ్-1లో ఉన్న పూర్తి భూ చరిత్రను పట్టించుకోకుండా, హడావుడిగా వెబ్లాండ్-2కి మారడం వెనుక భారీ కుట్ర దాగి ఉందంటూ మండిపడ్డారు.