అధికారులు గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి !


హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలమెంట్ విభాగం అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో కొత్త జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. క్యూర్ పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని చెప్పుకొచ్చారు. పరిపాలనను పట్టాలెక్కించాలనేదే తమ ఆలోచన అని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ అని వివరించారు. కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. జోన్‌ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్‌లదేనని స్పష్టం చేశారు. సిటీలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలని మార్గనిర్దేశం చేశారు. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ వాహనాలను తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. అలాగే, రోడ్లపై గుంతలు కనిపించొద్దని సూచించారు. జనన, మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువపత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని మార్గనిర్దేశం చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలని దిశానిర్దేశం చేశారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి ప్రారంభించాలని నిర్దేశించారు. నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలని సూచించారు. క్యూర్ ఏరియాలో ఆయా విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారని పేర్కొన్నారు. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు వీలైనంత స్పీడ్‌గా రెస్పాన్స్ అవ్వాలని మార్గనిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని సూచించారు. అధికారులు అందరూ కలిసి పనిచేస్తేనే నగరం భవిష్యత్ బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org