బనకచర్ల ప్రాజెక్టుకి సీడబ్య్లూసీ అనుమతిని ఆక్షేపించిన హరీశ్‌రావు
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ ఏపీ నిర్మిస్తోన్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్‌కు సీడబ్య్లూసీ అనుమతి వచ్చిందని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం లేకుండా సీడబ్య్లూసీ ఎలా అనుమతి ఇస్తోందని ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని ఆక్షేపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే సరిపోతోందని విమర్శించారు. నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోతుందా, నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తాను ఎటువంటి ఫేక్ రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణతో ఉన్న అనుబంధంతోనే తాను ఇలా మాట్లాడుతున్నానని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. తెలంగాణ జలదోపిడీకి సూత్రదారి ఆదిత్య నాథ్ దాస్ అని ఆరోపణలు చేశారు. తెలంగాణ ద్రోహి ఆయనేనని ఆక్షేపించారు. ఆదిత్య నాథ్ దాస్‌ను రేవంత్‌రెడ్డి సర్కార్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు సీడబ్య్లూసీ అనుమతి ఇచ్చేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఎంత ధైర్యమని నిలదీశారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై సీడబ్య్లూసీ అనుమతి రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నా చేద్దామని హరీశ్‌రావు సూచించారు.