బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో అరెస్టు
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను ఈ రోజు ఫెడరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా, అధికారాన్ని నిలుపుకోవడానికి తిరుగుబాటు కుట్రకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఇప్పటికే బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ శిక్ష అమలు జరగడానికి ముందుగానే ముందస్తు చర్యలో భాగంగా ఆయనను ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం బోల్సోనారోను అరెస్ట్ చేసినట్లు, ఆయనను రాజధాని బ్రసీలియాలోని పోలీసు కేంద్ర కార్యాలయానికి తరలించినట్లు బోల్సోనారో ప్రతినిధి ధ్రువీకరించారు. ఈ అరెస్టుపై స్పందించిన ఫెడరల్ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బోల్సోనారో 2019 నుంచి 2022 వరకు బ్రెజిల్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. 2022 అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా చేతిలో ఓడిపోయినప్పటికీ బోల్సోనారో ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించారు. ఆ సమయంలో వేల సంఖ్యలో ఆయన మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు, అల్లర్లకు పాల్పడ్డారు. పదవిలో కొనసాగేలా తిరుగుబాటు కుట్రకు బోల్సోనారో ప్రణాళికలు రచించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, మాజీ అధ్యక్షుడికి అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు, ప్రజాస్వామ్యంపై దాడులకు పాల్పడినందుకు సెప్టెంబర్‌లో 27 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బోల్సోనారో ఈ కేసు విచారణ సమయం నుంచే గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే, సుప్రీంకోర్టు విధించిన శిక్షపై ఆయన అప్పీలుకు వెళ్లినప్పటికీ, అక్కడ ఉపశమనం లభించలేదు. బోల్సోనారో తరఫు న్యాయవాదులు వాదిస్తూ, ఆయన ఆరోగ్యం క్షీణించిందని, జైలుకు వెళితే ప్రాణాలకు ముప్పు ఉందని, కాబట్టి గృహనిర్బంధంలోనే ఉంచాలని కోరారు. అయినప్పటికీ, కోర్టులు ఇప్పటివరకు ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే, ఆయన జైలు శిక్ష అనుభవించడానికి ముందు ముందస్తు అరెస్ట్‌గా దీన్ని భావిస్తున్నారు. బోల్సోనారో అరెస్ట్ బ్రెజిల్ రాజకీయాలలో ఒక కీలక పరిణామంగా నిలిచింది.