ఈరోజు ఉద్యోగులందరితో నిర్వహించిన సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ కొత్త ఏడాది (2026) సవాళ్లతో కూడుకున్నదని, ఏఐ పోటీ పెరకబోతోందని ఉద్యోగులకు తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ కు డిమాండ్ పెరగబోతోందని, తాము చేయాల్సిన పని చాలా ఉంది కాబట్టి ఉద్యోగులు విశ్రమించవద్దని కోరారు. అలాగే ఏఐ పెట్టుబడుల బుడగపై నెలకొన్న ఆందోళనలపైనా స్పందించారు. ఏఐ మార్కెట్, డిమాండ్ పెరుగుతున్న వేళ భారీ ఎత్తున దీనిపై పెట్టుబడులు పెడుతున్నారని, అయితే దీర్ఘకాలంలో అనుకున్న స్దాయిలో ఇది పుంజుకోకపోతే లాభదాయకత ఎలా ఉంటుందన్న ప్రశ్నకు స్పందిస్తూ దీనిపై సమయస్పూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఏఐపై ఎక్కువగా పెట్టుబడి పెట్టడం కంటే తక్కువ పెట్టుబడి పెట్టడం మరింత రిస్క్ ను తెస్తుందన్నారు. తాజాగా గూగుల్ క్లౌడ్ పై పెట్టిన పెట్టుబడుల్ని ఆయన గుర్తుచేశారు. ఇతర పోటీదారులతో పోలిస్తే మెరుగైన స్ధానంలో ఉండేందుకు వీలుగా గూగుల్ పెట్టుబడుల్ని పెడుతున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. వచ్చే ఏడాది కూడా సంస్ధలో ఎత్తుపల్లాలు తప్పవని ఆయన ఉద్యోగుల్ని హెచ్చరించారు. వచ్చే ఏడాదిలో ఉద్యోగులు తీరిగ్గా కూర్చోకుండా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థ కూడా ఇందుకు సిద్దంగా ఉందన్నారు. ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్ నుంచి గూగుల్ కు ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
0 Comments