2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ భారత్ కు సాధ్యమేనా ?
2030 నాటికి US $70 ట్రిలియన్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు 2024-2030 మధ్య 10.1 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రివైవింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఒక నివేదికను సమర్పించిన క్రమంలో వెల్లడించింది. నివేదిక ప్రకారం లాజిస్టిక్స్ పనితీరు సూచికలో భారత్ ర్యాంకింగ్ మెరుగుపడుతుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ తెలిపారు. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరిగిన బడ్జెట్‌పై ప్రభావం చూపించిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ మౌలిక సదుపాయాలు గణనీయమైన విస్తరణ కోసం విస్తృతమైన ప్రయత్నాలు చేశాయని స్పష్టం చేశారు. దీని వల్ల భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధిలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రైవేట్ కంపెనీలకు ఆస్కారం పెరుగుతుందని బైజల్ స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పరిధిని పరిమితం చేసే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ అన్నారు. ఈ క్రమంలో దేశంలో దీర్ఘకాలిక స్థిరమైన ఆర్థిక వృద్ధిని తీసుకురావడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రైవేట్ పెట్టుబడి కేటాయింపులను ప్రేరేపించడానికి ప్రధాన చర్యలు తీసుకోవాలని సూచించారు. మౌలిక సదుపాయాల పెట్టుబడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా ఆధారపడటం వల్ల ద్రవ్యలోటు లక్ష్యాలపై ఒత్తిడి పెరగవచ్చని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడం వల్ల ఆర్థిక లోటు లక్ష్యాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని కన్సల్టెంట్ నివేదిక అభిప్రాయపడింది.