రాజ్యసభలో ప్రతిపక్షనేతను ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఛైర్మన్ ప్రతిపక్ష సభ్యుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించారని, ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో సభా వ్యవహారాలపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఈరోజు కూడా సభలో ప్రతిపక్షనేతను మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. ఇది ప్రతిపక్షనేత ఖర్గేను, కాంగ్రెస్ పార్టీని అవమానించడమే. పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఏదైనా అంశంపై మాట్లాడితే రాజ్యసభ ఛైర్మన్ రికార్డు కాదని చెబుతారు. అదే అధికార పక్ష సభ్యులు మాట్లాడితే అది రికార్డు అవుతుంది. ఛైర్మన్ వ్యవహరిస్తున్న ఈ పక్షపాత ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదానీ ముడుపుల వ్యవహారం పక్కదోవ పట్టించేందుకే బిజెపి నేతలు జార్జ్ సోరెస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు' అని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తకుండా సభలో అధికారపార్టీ సభ్యులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఈ చర్యల వల్లే మేము ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చామని కాంగ్రెస్ ఎంపి సయ్యద్ నసీర్ హుస్సేన్ తెలిపారు.
0 Comments