తెలంగాణలో నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు !
తెలంగాణలోని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని ఈనెల 28 నుంచి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజైన డిసెంబరు 28న నిరుపేద కూలీలకు మొదటి విడతగా రూ.6వేలు ఇస్తామని చెప్పారు. వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి భారాస రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కలిగించి ప్రజలను మోసం చేయడమే భారాస నాయకులకు తెలుసన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల విస్తరణకోసం ప్రజా ప్రభుత్వం కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయనుందని వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తలమానికంగా మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టామన్నారు. అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్‌రోడ్ ఏర్పాటు చేస్తాం. ఔటర్ రింగ్‌రోడ్, రీజినల్ రింగ్‌రోడ్ మధ్య ఇండస్ట్రియల్, హౌసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు అందించబోతున్నాం. రాష్ట్ర అప్పులపై భారాస నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారాస పాలకులు ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆసుపత్రులు, ఉద్యోగుల జీపీఎఫ్, మిడ్ డే మీల్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర బకాయిలు రూ.40,154 కోట్లు. పదేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారాస ప్రభుత్వం రూ.7,11,911 కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపింది. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు 2014 నాటికి ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6,400 కోట్లు ఉండగా, పదేళ్లలో భారాస చేసిన అప్పుల వల్ల ఏడాదికి రూ.66,782 కోట్లు చెల్లించే దుస్థితికి భారాస తీసుకెళ్లింది. సన్నాలపై క్వింటాకు ఇస్తున్న రూ.500 బోనస్ ద్వారా ప్రతి ఏకరాకు రూ.10వేల నుంచి 15వేల వరకు అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తోంది. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి రైతులకు నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చుచేసింది'' అని భట్టి విక్రమార్క వివరించారు.