ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హోటల్స్ అసోసియేషన్ !
ఆంధ్రప్రదేశ్‌లో స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించిన హోటళ్ల యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్న స్విగ్గీపై హోటల్, రెస్టారంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని ఇటీవల నిర్ణయించాయి. తాజాగా విజయవాడలో స్విగ్గీ యాజమాన్య బృందం, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. విజయవాడలో హోటల్స్ అసోయేషన్ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి, కన్వీనర్ రమణరావు తదితరులు కలిసి 12 అంశాలపై స్విగ్గీ బృందంతో చర్చించారు. అసోసియేషన్ డిమాండ్లకు స్విగ్గీ బృందం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ద్వారా తమ నిర్ణయాలను వెల్లడిస్తామని స్విగ్గీ ప్రతినిధి బృందం వెల్లడించింది. ఈ మేరకు స్విగ్గితో చర్చల సందర్భంగా చేసుకున్న ఒప్పందాలు నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని అసోయేషన్ ప్రకటించింది.