ఢిల్లీలో ఆప్, భాజపా మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో ఢిల్లీ సీఎం అధికారిక నివాసం నుంచి ఆతిశీని బలవంతంగా ఖాళీ చేయించారంటూ ఆప్ చేస్తోన్న ఆరోపణలతో అక్కడి రాజకీయం మరోసారి వేడెక్కింది. తాజాగా సీఎం ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేమన్న నిరాశతోనే భాజపా ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఎన్నికల్లో భాజపాకు రెండంకెల సీట్లు కూడా రావన్నారు. ఆప్‌ను చీల్చేందుకు గతంలో చేపట్టిన 'ఆపరేషన్ కమలం' విఫలమైందన్న ఆతిశీ.. ఆప్ నేతలను జైళ్లకు పంపినా భాజపాకు ఫలితం దక్కలేదన్నారు. తమ పార్టీ బంగ్లాలు, కార్ల కోసం రాజకీయాలు చేయదని చెప్పారు. అవసరమైతే.. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు వీధుల్లోంచి పనిచేసేందుకు సైతం సిద్ధంగానే ఉన్నారన్నారు. ఆతిశీ తన వస్తువులతో నిండిన డబ్బాలు ఉన్నచోట ఫైల్స్‌పై సంతకాలు చేస్తున్న ఫొటోలను ఆప్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంపై భాజపా తప్పుపట్టింది. ఆప్ డ్రామాలు ఆడుతోందని.. ప్రజల్లో సానుభూతి కార్డు ప్లే చేస్తోందని మండిపడుతోంది. ఆప్ నేతలు చెబుతున్నట్లుగా ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని బంగ్లా ఢిల్లీ సీఎం అధికారిక నివాసం కాదని భాజపా ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ అన్నారు. ఆతిశీకి మథుర రోడ్డులో ఇప్పటికే బంగ్లా ఉందని.. ఆప్ నేతలు చెబుతున్నవి కేవలం ఆరోపణలేనన్నారు. సీఎం ఢిల్లీ సచివాలయంలో తన పూర్తిస్థాయి కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉన్నా.. ఇలా ఖాళీ పెట్టెలు ఉన్నచోట ఫైళ్లపై సంతకాలు చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను షేర్ చేయడం ద్వారా ఆప్ నేతలు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని భాజపా నేతలు పేర్కొన్నారు.
0 Comments