సిరియాపై అమెరికా జరిపిన దాడుల్లో 37 మంది మృతి !
లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వరుస దాడులు తదితర పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా యుద్ధ విస్తరణ భయాల నడుమ.. అటు సిరియాలో అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. వారంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని తెలిపింది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. అల్ ఖైదా అనుబంధ 'హుర్రాస్ అల్-దీన్ గ్రూప్'నకు చెందిన ఓ సీనియర్ ఉగ్రవాదితోపాటు మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకుని వాయువ్య సిరియాపై దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఆ సీనియర్ ఉగ్రవాది స్థానికంగా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. అంతకుముందు మధ్య సిరియాలోని ఐసిస్ శిక్షణ స్థావరంపై పెద్దఎత్తున వైమానిక దాడి నిర్వహించి 28 మంది ఉగ్రవాదులను అంతమొందించినట్లు చెప్పింది.