వాక్కాయ - ఆరోగ్య ప్రయోజనాలు !
వాక్కాయలు లేత గులాబీ రంగులో పుల్లగా ఉంటాయి. చాలా ప్రాంతాలలో వీటితో పచ్చడి, పప్పు వంటి వంటకాలు చేస్తుంటారు. అడవి ప్రాంతాలలో వాక్కాయ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. చాలా మందికి వాక్కాయలతో వంటలు చేస్తారని తెలుసు కానీ వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. అవేంటో తెలిస్తే వాక్కాయలు ఎక్కడ కనిపించినా వాటిని వదలలాని అనిపించదు. వాక్కాయలలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, దీని వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఉండే ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండాలంటే వాక్కాయలను తప్పనిసరిగా తినాలి. ఫైబర్ ఉన్న పండ్లు, కూరగాయలు జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. వాక్కాయలలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. వాక్కాయలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది. వాక్కాయలలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కుంటాయి. చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా వాక్కాయలు మెరుగ్గా పనిచేస్తాయి. మధుమేహం ఉన్నవారు వాక్కాయలతో చేసిన ఆహార పదార్థాలు తింటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాక్కాయను యాపిల్, నారింజ, లేదా నీటితో అయినా సరే కలిపి జ్యూస్ తయారుచేసుకుని తాగితే మంచిది. ఇది శరీరానికి పోషకాలనే కాదు.. మంచి రిఫ్రెష్మెంట్ కూడా ఇస్తుంది. వాక్కాయలు ఎల్లప్పుడూ అందుబాటులో లేని వారు వాక్కాయలను ఎండించి పొడి చేసుకుని వాటిని కూరల్లోనూ, పులుసు తయారీలోనూ జోడించవచ్చు. ఇది కూరకు అదనపు రుచిని ఇవ్వడమే కాకుండా వాక్కాయ నుండి లభించే ఫలితాలు లభిస్తాయి.