ఆశ్రయం కల్పించాలని కోరుతూ భారత సరిహద్దుకు చేరుకుంటున్న బంగ్లా దేశీయులు !
బంగ్లాదేశ్‌లో దాడులకు భయపడి అనేక మంది ఆ దేశ పౌరులు ఆశ్రయం కల్పించాలని కోరుతూ భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లా దక్షిణ్ బెరూబారీ గ్రామంలో ఉన్న ఔట్‌పోస్టు వద్ద వందల మంది బంగ్లాదేశీయులు బారులు తీరినట్లు తెలుస్తోంది. ఇనుప కంచె వద్దకు వచ్చిన వారంతా స్వదేశంలో నెలకొన్న భయానక పరిస్థితులను వివరించారని, భారత్‌లో ఆశ్రయం కల్పించాలని వేడుకున్నారని స్థానికులు వెల్లడించారు. అయితే, సరిహద్దు మొత్తం మూసివేసి ఉండటంతో వాళ్లు భారత్‌లోకి ప్రవేశించలేకపోయినట్లు బీఎస్‌ఎఫ్ దళాలు వెల్లడించాయి. అనంతరం వారిని బంగ్లా సరిహద్దు బలగాలు వెనక్కి తీసుకువెళ్లినట్లు తెలిపాయి. బంగ్లాదేశ్‌లో హింస చెలరేగిన నేపథ్యంలో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి బీఎస్‌ఎఫ్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.