సైబర్ దాడి కాదు - సమస్యను పరిష్కరించాం : మైక్రోసాఫ్ట్ వెల్లడి !
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో శుక్రవారం తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై స్పందించిన టెక్ దిగ్గజం.. సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. 'బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్'కు కారణమైన క్రౌడ్ స్ట్రయిక్ అప్‌డేట్ వెనక్కి తీసుకుంది. దీనికి డీబగ్‌ను రూపొందించామని, ప్రస్తుతం సమస్య పరిష్కారమైనట్లు కంపెనీ ప్రకటించింది. కానీ, ఇంకా మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసుల్లో సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అటు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ కూడా దీనిపై స్పందించారు. ''సింగిల్ కంటెంట్ అప్‌డేట్‌లో బగ్‌తో తలెత్తిన కస్టమర్లతో మా కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. మ్యాక్, లైనక్స్ సిస్టమ్‌లపై ఎలాంటి ప్రభావం పడలేదు. అయితే, ఇది భద్రతాపరమైన వైఫల్యమో, సైబర్ దాడో కాదు. సమస్యను గుర్తించి డీబగ్‌ను ఫిక్స్ చేశాం. క్రౌడ్ స్ట్రయిక్ కస్టమర్ల భద్రతకు మేం పూర్తి ప్రాధాన్యమిస్తాం'' అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్‍లతో నడుస్తున్న కంప్యూటర్లలో ప్రధానంగా ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. క్లౌడ్ సర్వీస్‍లతో నడిచే పీసీలు, ల్యాప్‍ట్యాప్‍లు, మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసుల్లోనూ ఇబ్బందులు వచ్చాయి. దీని కారణంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కన్పించింది. దీంతో ఆయా సిస్టమ్‌లు షట్‌డౌన్/ రీస్టార్ట్ అయ్యాయి. ఈ ఎర్రర్ వల్ల బ్యాంకింగ్, ఎయిర్‍లైన్స్, ఐటీ, బ్రాడ్‍కాస్టింగ్‍పై తీవ్ర ప్రభావం పడింది.