పెన్షన్ల పంపిణీలో చేతివాటం - సచివాలయ ఉద్యోగి సస్పెండ్ !
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్లలోని 9వ వార్డు సచివాలయంలో పెన్షనర్ల దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడన్న ఆరోపణపై వెంటనే విచారణ జరిపి ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ బాలు నాయక్ వృద్ధుల పెన్షన్ డబ్బుల నుంచి ఐదేసి వందలు తీసుకుని ఉద్యోగం పోగొట్టుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. పెనుమాక ఎస్టీ కాలనీలో బానావత్ నాయక్ కుటుంబానికి మొదటి పెన్షన్ అందజేశారు. పూరి గుడిసెలో ఉంటున్న లబ్ధిదారుని ఇంటికి వెళ్లి నగదు అందించారు. నాయక్‌కు వృద్ధాప్య ఫించన్, అతని కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు సీఎం. ఆయన ఇద్దరి కుమారులు చదువు గురించి ఆరా తీశారు. వారి నివాసంలో 30 నిమిషాల పాటు కూర్చొని బాగోగుల గురించి మాట్లాడారు. నాయక్ అభ్యర్థన మేరకు ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం. చంద్రబాబుతో పాటు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు. అగ్రవర్ణాలు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్న సీఎం.. ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందాలని సీఎం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు పవన్ వచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగి నపెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పవన్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.