Ad Code

బ్రాడ్‌కాస్ట్‌ టెలివిజన్‌ రూపంలో సెల్‌ఫోన్‌

టెక్నాలజీ ఎంత వేగంగా మార్పులు తీసుకువస్తోందో, మారిన టెక్నాలజీని అందిపుచ్చుకునేంతలోనే మరో టెక్నాలజీ రావటం ఎంతో సహజంగా మారిపోయింది. అందరికీ బుల్లిపెట్టెగా ఎంతో సుపరిచితమైన టెలివిజన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నాలజీ రాకతో రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం ఎవరైనా టెలివిజన్‌ చూడాలనుకుంటే ఇంట్లోనో, ఆఫీసులో ఉన్న టివిని ఆన్‌ చేస్తారు. లేకపోతే, ఎలా..? ప్రయాణం చేస్తున్నారు..మీకిష్టమైన క్రికెట్‌ మ్యాచ్‌ వస్తోంది. అప్పడు చూడాలనుకుంటే ఎలా? మారిన టెక్నాలజీ వల్ల ఇది ఎంతో సులభం. ప్రస్తుతం బ్రాడ్‌కాస్ట్‌ టెలివిజన్‌ రూపంలో సెల్‌ఫోన్‌లో టెలివిజన్‌ ప్రసారాలను వీక్షించే సౌలభ్యం లభిస్తోంది. డివిబి-హెచ్‌ టెక్నాలజీని సెల్‌ఫోన్‌లో టెలివిజన్‌ ప్రసారాల కోసమే ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఇప్పుటికే ఈ డివిబి-హెచ్‌ టెక్నాలజీని యూరప్‌, ఆస్ట్రేలియా, ఆసియా దేశాలైన ఇండోనేషియా, తైవాన్‌, మలేషియాల్లో ప్రవేశపెట్టగా ఇటీవలే భారత్‌లోనూ ఇది ప్రవేశించింది. ఈ డివిబి-హెచ్‌ టెక్నాలజీ ద్వారా పై దేశాల్లో ఇప్పటికే సెల్‌ఫోన్‌లో టెలివిజన్‌ ప్రసారాలు ప్రసారమౌతున్నాయి.
జిఎస్‌ఎమ్‌, సిడిఎమ్‌ఏ రెండింటిలో టెలివిజన్‌ ప్రసారాలను సెల్‌ఫోన్‌లో చూడాలంటే మాత్రం మూడో తరం (ధర్డ్‌ జనరేషన్‌) నెట్‌వర్క్‌ ప్రొవైడర్స్‌ కలిగి ఉండాలి. 3.5జి, వైమ్యాక్స్‌ సౌకర్యాలు సెల్‌ఫోన్‌ తయారీదారుడు పొందుపరిచి ఉండాలి. కేవలం జిపిఆర్‌ఎస్‌(జనరల్‌ ప్యాకెట్‌ రేడియో సర్వీసెస్‌) అందజేయటమే కాకుండా, బ్రాడ్‌కాస్ట్‌ టెక్నాలజీ ద్వారా వేగవంతంగా మాస్‌ కంటెంట్‌ను ఆపరేటర్‌ వినియోగదారునికి చేరవేసే టెక్నాలజీలో నైపుణ్యం పొంది ఉండాలి. మూడో తరం సర్వీస్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గంటకు 100 నుంచి 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ, ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేసుకోవచ్చు. సినిమాలు, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను డౌన్‌లోడింగ్‌ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అంతేగాక, టెలివిజన్‌ ప్రసారాలను సైతం చూదవచ్చు. 1995లోనే దీనికి సంబంధించిన వివరాలను హార్వర్డ్‌ యూనివర్శిటీ ఫ్రొఫెసర్‌ క్లేటన్‌ క్ట్రిస్టిన్సీ డివిబి-హెచ్‌ను అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ప్రవేశించాక, ఎక్కువ మంది అమెరికన్లు తమకిష్టమైన ఆటలను సెల్‌ఫోన్‌ను ఉపయోగించి వీక్షిస్తున్నట్లు వెల్లడైంది. ఆఫీసుకు వెళుతూ ఇంటర్నెట్‌ను వినియోగించే వారికంటే, తమ సెల్‌ఫోన్‌లో మల్టీమీడియా కంటెంట్‌ను డౌన్‌లోడింగ్‌ చేసుకునేవారి సంఖ్య మూడింతలు పైగా ఉందని వెల్లడైంది. ప్రత్యేకించి పర్సనల్‌ డిజిటల్‌ అసెస్టింట్స్‌(పిడిఏ) వంటివి, కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్స్‌లు, సెల్‌ఫోన్‌ల వాడకం పెరిగాక నెట్‌వర్కింగ్‌ ఏర్పడింది. ఒక ఎలక్ట్రానిక్‌ పరికరం నుంచి మరో ఎలక్ట్రానిక్‌ పరికరంతో అనుసం ధానం ఏర్పరచటానికి నెట్‌వర్కింగ్‌ ఎంతో ముఖ్యమైనది. నెట్‌వర్కింగ్‌ కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీయే ఈ డివిబి-హెచ్‌. ఇది పూర్తిస్థాయిలో వాణిజ్య స్థాయిలో వినియోగంలోకి వస్తే టెలివిజన్‌ చూసేవారి సంఖ్య కన్నా, సెల్‌ఫోన్‌లోనే ప్రత్యక్ష ప్రసారాలు చూసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
ఇది ఎలా పనిచేస్తుందంటే..
సెకనుకు నిర్ణీత పరిధిలో డేటాను వెయ్యి భాగాలుగా విడగొట్టి డేటాను ఏకకాలంలో ఫ్రేమ్‌గా పొందుపరుస్తుంది. అంటే..సెల్‌ఫోన్‌లో 50 మల్టీఫ్లెక్స్‌ ఛానల్‌ చూడాలనుకుంటే..గరిష్టంగా 0.2 నుంచి 0.5 మెగాబైట్స్‌ను సెకనుకు ఇస్తూ దాన్ని 4 నుంచి 5 ఎమ్‌బిపిఎస్‌ వరకు కనిష్టంగా డేటాను ఈ డివిబి టెక్నాలజీ ప్రసారం చేస్తుంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ పై దూరదర్శన్‌ ప్రయోగాత్మకంగా ఒక ట్రయిల్‌ను చేసింది కూడా. ప్రసార భారతి ఈ టెక్నాలజీ వాడకాన్ని దేశంలో అనుమతించింది. తద్వారా డిడి నేషనల్‌, డిడి న్యూస్‌, డిడి స్పోర్ట్స్‌, డిడి భారతి వంటి ఛానల్స్‌నే గాక, ఎనిమిది ప్రాంతీయ ఛానల్స్‌ను సెల్‌ఫోన్‌లో ఉచితంగా చూసే సౌలభ్యం ఉంది. గత నెలలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ అయిన నోకియాతో ప్రసార భారతి ఒప్పందం కుదర్చుకుంది. నోకియా సంస్థ ఆసియా-ఫసిఫిక్‌ ప్రాంతం పూర్తిగా డివిబి-హెచ్‌ టెక్నాలజీ అనుగుణంగా ఉండే హ్యాండ్‌సెట్లను రూపొందించటనున్నట్లు ప్రకంటించింది. భవిష్యత్‌లో దీనివల్ల కంప్యూటర్‌ అనేదానికి సరికొత్త నిర్వచనం ఇవ్వాల్సి ఉంటుందని నోకియా ఆసియా సింగపూర్‌ హెడ్‌ పవన్‌ గాంధీ వ్యాఖ్యానించటం ఈ టెక్నాలజీ ఎంతవేగంగా ఉందో తెలియజేస్తోంది. దీనివల్ల గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కారులో ప్రయాణిస్తూ ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేసుకోవటం, మల్టీమీడియా కంటెంట్‌ను యాక్సెస్‌ చేయటం వంటి పనులు సులభతరం అవుతాయి. పైన చెపినట్లు ఈ విధంగా యాక్సెస్‌ చేయాలంటే జిఎస్‌ఎమ్‌లో అయితే మూడోతరం (3జి) నెట్‌వర్క్‌ అవసరం ఎంతో ముఖ్యం. సిడిఎమ్‌ఏలో క్వాలికామ్‌ ప్రాధాన్యమైనది. (ఈ క్వాలికామ్‌ అమెరికాలో ఎఫ్‌ఎల్‌ఓ స్టాండర్స్‌ అనుగుణంగా రూపొందిచబడింది.) వైర్‌లెస్‌ మీడియా స్టేటజీస్‌ (డబ్ల్యుఎమ్‌ఎస్‌) అనే సంస్థ గణాంకాల ప్రకారం 2007 నాటి చివరికి డిజిటల్‌ వీడియో బ్రాడ్‌కాస్టింగ్‌ అనేది భారీగా విస్తరిస్తుందని తెలిపింది. చైనా రాజధాని బీజింగ్‌లో 2008లో జరిగే ఒలంపిక్‌ గేమ్స్‌ను సెల్‌ఫోన్స్‌లో చూడటానికి వీలుగా అత్యాధునిక బ్రాడ్‌బ్యాండ్‌ కాంటెంట్‌ను డెవలప్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి చినాబీ మల్టీమీడియా మెబైల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అని పేరు పెట్టింది. ఇప్పటికే నోకియా ఎన్‌ 92 మోడల్‌ను భారతదేశంలోనూ ప్రవేశపెట్టింది. ఈ డివిబి ప్రాజెక్ట్‌ ప్రపంచం మెత్తం మీద 300కి పైగా బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థలు, నెట్‌వర్క్‌ ఆపరేటర్లు, తయారీదారులు ఇందులో పాలుపంచుకోగా 35 దేశాలు ఇప్పటివరకు ఈ డివిబి టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం సెల్‌ఫోన్‌లో టెలివిజన్‌ చూడాలి అనుకుంటే ఖరీదైన వ్యవహారంగా పేర్కొనవచ్చు. నోకియా, మోటరోలా, కొరియాకు చెందిన స్యామ్‌ సంగ్‌ సంస్థలు ఈ టెక్నాలజీతో ఉన్న హ్యాండ్‌సెట్లను రూపొందిస్తున్నాయి. వాటికోసం 30,000 రూపాయలపైనే వెచ్చించాల్సి ఉంది. నోకియా ఎన్‌77
నోకియా సంస్థ త్వరలో ఎన్‌77 టివి సెల్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల
చేయనున్నట్లుగా వెల్లడించింది. దీని ద్వారా టెలివిజన్‌ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చునని తెలియజేసింది. ఈ సెల్‌ఫోన్‌లో స్క్రీన్‌ 2.4 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. దీంట్లో ప్రత్యక్ష ప్రసారాలను 30సెకన్ల తర్వాత రీప్లే ద్వారా చూడగలిగే సౌకర్యం ఉందని సంస్థ పేర్కొంది. ఇంతకుముందు విడుదల చేసిన ఎన్‌ సిరీస్‌ కన్నా ఇందులో అత్యాథునికమైన ఫీచర్లు పొందుపరిచినట్లు సంస్థ తెలిపింది. ఎమ్‌పి3 ప్లేయర్‌, 2మెగాపిక్సల్‌ కెమెరా, వెబ్‌బ్రౌజింగ్‌, ఈ-మెయిల్‌ యాక్సింగ్‌ ఇందులో ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఇది సింబయాన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu