ఈక్వల్ ఏరియా మ్యాప్ తీర్మానానికి భారత్ మద్దతు : సరిహద్దులు, సార్వభౌమత్వ విషయంలో ఎలాంటి రాజీపడేది ప్రసక్తి లేదు
ఐక్యరాజ్యసమితి సరికొత్త ఈక్వల్ ఏరియా మ్యాప్ తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. అదే సమయంలో జాతీయ సరిహద్దులు, సార్వభౌమత్వ విషయంలో మాత్రం ఎలాంటి రాజీపడేది లేదని స్పష్టం చేసింది. అయితే, తమ మద్దతు ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ సరిహద్దుల చిత్రణకు, ప్రపంచ పటంలో కొత్త మార్పులకు అంగీకరించినట్లుగా కాదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఐరాస తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసినప్పటికీ రాజకీయ ఉద్దేశాలతో సరిహద్దులు, వివాదాస్పద భూభాగాలను తప్పుగా చూపే మ్యాప్‌లను తాము అంగీకరించబోమని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌లతో సహా భారత సార్వభౌమ భూభాగాలను ఎప్పుడూ దేశ అధికారిక పటం ప్రకారమే చిత్రీకరించాలని తెలిపారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాల్లో భారత్ వైఖరి ఎప్పటికీ నిక్కచ్చిగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన తెలిపారు. నౌకాయాన అవసరాల కోసం 16వ శతాబ్దంలో రూపొందించిన పాత మర్కేట ప్రపంచ పటం కాలం చెల్లినదిగా ఐరాస ప్రకటించింది. ప్రపంచ దేశాల వైశాల్యాన్ని మరింత కచ్చితంగా చూపించేందుకు సరికొత్త 'ఈక్వల్ ఏరియా మ్యాప్'ను ప్రామాణికంగా మలుస్తూ ఐరాస తీర్మానాన్ని ఆమోదించింది. ఈ కొత్త పటంలో దేశాల వాస్తవ భూభాగాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. కేవలం ప్రొజెక్షన్ విధానం కారణంగా భారత్, ఆఫ్రికా ఖండాలు పెద్దవిగా, అమెరికా కొంత చిన్నవిగా కనిపించనున్నాయి.