జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న సొరంగంలో భారీ ప్రమాదం : ఏడుగురు కార్మికులు దుర్మరణం
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మాయాపుర్ వద్ద టీహెచ్‌డీసీ జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న సొరంగంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా కొండచరియలు విరిగిపడటంతోపాటు పెద్దఎత్తున మట్టి దిబ్బలు, నీరు ఒక్కసారిగా సొరంగంలోకి దూసుకురావడంతో లోపల విధులు నిర్వహిస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హెచ్‌సీసీ సంస్థ నిర్మిస్తున్న ఈ సొరంగంలో మొత్తం 22 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, భారత ఆర్మీ, ఐటీబీపీ, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. నీరు, బురద ఎక్కువగా పేరుకుపోవడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రత్యేక డ్రమ్ బోట్ల ద్వారా సొరంగంలోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. హెవీ మెషినరీ ద్వారా మట్టిని తొలగిస్తూ, నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నారు. గాయపడిన 14 మంది కార్మికులను సమీపంలోని గోపేశ్వర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం మెగా ఆస్పత్రులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న చివరి వ్యక్తిని కూడా సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ ప్రాధాన్యమని సీఎం తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉండటంతో, సీఎం ధామీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు.