సీఎన్‌జీ సిలిండర్ పేలి ఇన్నోవా ఎస్‌యూవీపైకి దూసుకెళ్లిన స్విఫ్ట్ కారు : ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా ఆరుగురికి గాయాలు
ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఐటీఓ జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి ఓ స్విఫ్ట్ కారులోని సీఎన్‌జీ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి పిడబ్ల్యూడీ కార్యాలయం సమీపంలో ఉన్న రోడ్డు డివైడర్‌ను, ఆపై ఐరన్ రైలింగ్‌ను బలంగా ఢీకొట్టి, వేగంగా అవతలి వైపు మార్గం నుంచి వస్తున్న ఇన్నోవా ఎస్‌యూవీపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సహా మొత్తం ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి సుమారు 9.30 గంటలకు సెంట్రల్ ఢిల్లీలోని ఐటీఓ కూడలి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మీనగర్ నుంచి ఐటీఓ వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా సీఎన్‌జీ సిలిండర్ పేలింది. ప్రమాదానికి గురైన స్విఫ్ట్ కారులో అశుతోష్ పాండేతో పాటు ఆయన భార్య, ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వ బోర్డు ఉన్న ఇన్నోవా ఎస్‌యూవీలో కిరారీ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే అభయ్ పటేల్ ప్రయాణిస్తున్నారు. ఢీకొన్న తీవ్రతకు రెండు వాహనాల ముందు భాగాలు భారీగా దెబ్బతిన్నాయి. స్విఫ్ట్ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఇన్నోవా ముందు భాగం కూడా తీవ్రంగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రెండు వాహనాల్లోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో మొత్తం ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.